కోట్లున్న గరీబోడు
సంపన్న కుటుంబంలో పుట్టాడతడు. కోటల్లో గడిపాడు.. కోట్లల్లో బతికాడు. పేదరికమంటే ఏమిటో తెలియదు. కష్టజీవులు ఎలా కాలం వెళ్లదీస్తారో దగ్గర్నుంచి ఎప్పుడూ చూడలేదు. కొడుకు ఇలాగుంటే కష్టమనుకున్నాడు తండ్రి. తన వ్యాపారంలో అడుగుపెట్టే ముందు ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నాడు. నెలరోజులపాటు అతి సాధారణ జీవితం గడిపి గరీబీ ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవాలని ఆజ్ఞాపించాడు. అంతే.. తండ్రి చెప్పినట్టే చేశాడు ఆ యువకుడు. హైదరాబాద్‌కి వచ్చి కూలీనాలి చేశాడు.. అరకొరగా ఆకలి తీర్చుకుంటూ మురికివాడల్లో నివసించాడు.గుజరాత్‌కి చెందిన ఘన్‌శ్యాం డోలాకియా ఓ పెద్ద బిజినెస్‌మన్. హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో ఆయనకు వజ్రాల వ్యాపారం ఉంది. దాని టర్నోవర్ రూ. 6 వేల కోట్లు. తమ కంపెనీలో పనిచేసే కార్మికులకు 'పండగ మామూలు'గా కార్లు, బంగ్లాలు ఇచ్చే సహృదయ సంపన్నుడు ఆయన.
డోలాకియా కుటుంబంలో ఓ సంప్రదాయం ఉంది. అన్నదమ్ముల పిల్లల్లో వ్యాపారంలో అడుగుపెట్టే వారు ఓ అగ్ని పరీక్షకు సిద్ధం కావాలి. నెలరోజుల పాటు తమకు పరిచయం లేని ప్రాంతానికి వెళ్లి అత్యంత సామాన్యుడిగా బతకాలి. కాయకష్టం చేసి రోజులు వె ళ్లదీయాలి. తమ వివరాలు ఎవరికీ చెప్పొద్దు. అదే కుటుంబంలో పుట్టిన హితార్థ్ దోలాకియా (21) అలాంటి పరీక్షనే ఎదుర్కొన్నాడు.
అప్పుడే అమెరికాలో చదువు పూర్తి చేసుకుని వచ్చిన హితార్థ్కి కుటుంబంలో ఉన్న రివాజును వివరించాడు తండ్రి ఘన్‌శ్యాం. జేబులో రూ. 500 పెట్టాడు. మొబైల్ ఫోన్, వ్యక్తిగత గుర్తింపు కార్డు సైతం లేకుండానే సాగనంపాడు. చేతికి చిన్న కవరు ఇచ్చాడు. ఇంట్లోంచి బయల్దేరాక చూసుకోమన్నాడు. కొద్ది దూరం వెళ్లాక ఆ కవర్ని తెరచి చూశాడు హితార్థ్. అందులో హైదరాబాద్‌కి ఫ్లయిట్ టికెట్ ఉంది. వెంటనే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి ఫ్లయిట్ ఎక్కాడు.
హైదరాబాద్‌లో అడుగు పెట్టిన హితార్థ్కి అంతా కొత్తగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ కొలువు దొరకడం కష్టమైంది. ఉద్యోగం కావాలంటే తన చిరునామా, గుర్తింపు కార్డు, ఫోన్ నంబర్, ఆధార్‌కార్డు సహా అన్ని వివరాలు తప్పనిసరి అన్నారు. చివరకు తన వివరాలు వారంలో ఇస్తానని చెప్పి మెక్‌డోనాల్డ్స్ ఫుడ్కోర్ట్, ఆడిదాస్ షోరూం, చిల్లీస్ రెస్టారెంట్ సహా సికింద్రాబాద్‌లోని కార్డుబోర్డ్ షాపుల్లో దినసరి కార్మికుడిగా నెలరోజులపాటు పనిచేశాడు. తనకు పరిచయమైన రిక్షావాలాతో కలిసి మురికివాడలోని ఇరుకు గదిలో గడిపాడు. రోడ్డు పక్కన దొరికే టిఫిన్లు తిని అరకొరగా కడుపు నింపుకున్నాడు.
ఎట్టకేలకు గడువు ముగిసింది. తానెక్కడున్నాడో కుటుంబ సభ్యులకు తెలిపాడు హితార్థ్. అంతే.. హైదరాబాద్‌కి వచ్చేసి తమతోపాటు అతడిని తీసుకెళ్లిపోయారు. పోతూ పోతూ మీడియా సమావేశం పెట్టి హితార్థ్ విషయాన్ని బయటపెట్టారు. అప్పటి వరకు అతడెవరో ఇక్కడ ఎవరికీ తెలియదు. మన రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదితో డోలాకియా ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ ఉంది. హితార్థ్ ఇక్కడ నెలరోజులు హైదరాబాద్‌లో అతి సామాన్య జీవనం గడిపాడనే విషయం ఆయనకు కూడా తెలియదు.
గుజరాత్‌కి బయల్దేరే ముందు హితార్థ్ మీడియాతో మాట్లాడాడు 'హైదరాబాద్ కల్చర్ నాకు బాగా నచ్చింది. నేనెవరో తెలియక పోయినా ఇక్కడి వారు నన్ను ఆదరించారు. కొద్దిగా కష్టపడే తత్వం, నైపుణ్యం ఉంటే ఇక్కడ హాయిగా బతికేయొచ్చు. ఈ అనుభవం నాకు బాగా ఉపయోగపడుతుంది. మా సంస్థలో పనిచేసే కార్మికుల పట్ల ఎలా వ్యవహరించాలో ఇక్కడ నేర్చుకున్నాను' అన్నాడు.



Post a Comment
0Comments